12, ఫిబ్రవరి 2015, గురువారం

ప్రకృతి ఒడిలోకి...

 ప్రకృతి ఒడిలోకి...
భావరాజు పద్మిని 

నునులేత భానుకిరణాలు, 
మబ్బుల మంచుముసుగు కరిగించే వేళ....

కరిగిన మంచు ముత్యాలు,
చెట్ల ఆకులపై చిరుసవ్వడి చేస్తూ జారే వేళ...

చినుకు స్పర్శ పులకలు,
పక్షుల కిలకిల రావాలై పల్లవించే వేళ....

కొండ లోయల్లో పక్షుల రావాలు,
కమ్మగా ప్రతిధ్వనిస్తూ మురిపించే వేళ....

పిల్లగాలి అలలపై తేలుతూ ,
ఔషధ సుగంధాలు తరలివచ్చే వేళ...



వింత పూవుల సోబగులేవో,
వర్ణాల తోరణాలు కట్టి స్వాగతించే వేళ...

మట్టి దారుల్లో, రాళ్ల బాటల్లో, 
అల్లుకున్న లతల్లో, అడవి చెట్లలో,
మనసు మురిసే  మధుర సడిలో,
ఆలోచనల అలజడిని శాంతపరచి,
ఎప్పుడైనా ....
ప్రకృతి ఒడిలోకి పయనిస్తే....

ఉదయరాగం హృదయరాగమై వ్యాపిస్తుంది,
అంతరంగం ఆనందతరంగాలలో తేలుతుంది, 
మౌన మునిలా ఆత్మ నాట్యమాడుతుంది,
ఆ అనుభూతి శాశ్వతంగా నిక్షిప్తమైపోతుంది.

(అహోబిలంలో 26/12/2013 ఉదయాన్నే పావన నృసింహుని దర్శనానికి అడవి దారుల్లో నడచినప్పుడు కలిగిన భావనలు... )

స్త్రీ జన్మ


స్త్రీ జన్మ 
------------
భావరాజు పద్మిని - 20/6/14 
వేలు తెగింది లోతుగా...
బొటబొటా రక్తం నేల కారింది ...
చప్పున చిటికెడు పసుపు అద్ది,
రక్తం, గాయం నోరు నొక్కేసా.
ఆశ్చర్యం...
కంట్లోంచి ఒక్క కన్నీటి చుక్క రాలలేదు,
'అమ్మా' అన్నకేక కూడా గొంతుదాటి రాలేదు.
అంతగా బండబారిపోయావా ?
సూటిగా ప్రశ్నించింది అంతరంగం...

ఒక్క క్షణం ఆలోచన, 
మరుక్షణం నిర్వేదంగా ఓ చిరునవ్వు...
నేనేంటి , ఈ పవిత్ర భారతావనిలో 
పుట్టిన ప్రతీ స్త్రీ బండరాయే... 
ప్రతీ ఇల్లాలు ఉలి దెబ్బలు తిన్న శిల్పమే...

ఎందుకంటే...
అమ్మానాన్న ఒడిలో అపురూపంగా పెరుగుతుంది,
అడుగేసినా, ఆడినా, పాడినా వాళ్లకు వేడుకే !
చిన్న దెబ్బ తగిలినా, గాయమైనా వారి కంటనీరే !
బిడ్డ కష్టం తట్టుకోలేని మనసులు, కంటికి రెప్పలా కాచి,
వెయ్యి దేవుళ్ళకి మొక్కి, తగ్గేదాకా తల్లడిల్లిపోతారు,
బిడ్డ కష్టాన్ని, బాధని మరపించేలా మురిపిస్తారు.
పెంచి పెళ్లి చెయ్యగానే మరో అధ్యాయం మొదలౌతుంది...
ఆడ జ్వరాలు, మగ జ్వరాలు ఉంటాయని, 
కొడుకు-కూతురు బాధలు, కోడలి బాధలు వేరని, 
కొత్తగా తెలుస్తుంది...
తిన్నా తినకున్నా అడిగేవారు ఉండరని అర్ధమౌతుంది.



మాటల అస్త్రాలు, నిందల శరాలు,
అహాల, అధికారాల దాహాలు,మిధ్యాదర్పాలు,
నిత్యం కొన్ని వేల మైళ్ళ వేగంతో దూసుకువచ్చి,
మనసు అద్దాన్ని ముక్కలు ముక్కలు చేస్తాయి.
మళ్ళీ ఆశ చిగురులు తొడుక్కుని, 
అద్దపు ముక్కల్ని ఒక్కొక్కటే కూడగట్టుకుని,
అతుక్కుని, ఆ ముక్కలైన అద్దంలో చూస్తూ,
తన పాపిట సింధూరం దిద్దుకుంటుంది.

భర్త కోసమో, కాపురం కోసమో,
వాళ్ళ వంశం నిలబెట్టటడం కోసమో,
తన ప్రాణాన్ని పణంగా పెడుతుంది...
కడుపులోని బిడ్డ కోసం కన్నీరు మింగేసి,
ధైర్యాన్ని కూడగట్టుకుంటుంది ....
మరిన్ని సవాళ్లు, మరిన్ని మాటల తూటాలు,
పగిలిన అద్దానికి ఇక ఎన్ని గాయాలైనా ఒకటే!

అందుకేనేమో...
స్త్రీకి భూమాత అంత సహనం అంటారు.
తవ్వినా, కోసినా, కొట్టినా, కాల్చినా,
మరలా పైపొరలు ఆత్రంగా కప్పుకుని,
నొప్పి, బాధ మౌనంగా తట్టుకుని,
తనలోని జీవానికి ప్రాణం పోస్తుంది.
హరితవనంలా చిరునవ్వులు రువ్వుతుంది.

నేనూ స్త్రీనేగా...
కాకపొతే, నట్టేట మంధర పర్వతంలాంటి నన్ను,
గురువనే కూర్మం తన కటాక్షంతో నిలబెట్టి,
నా భారాలన్నీ ఆయన మోస్తూ, 
జీవితసాగర మధనం చేయిస్తున్నారు...
ఒక ప్రక్క దేవతలు, ఒక ప్రక్క రాక్షసులు,
ఎవరు ఎప్పుడు ఎటు మారతారో తెలియకున్నా,
నన్ను ఆసరాగా పాముతో పట్టుకున్న వాళ్ళకు,
అమృతం అందించాలని,అంతర్మధనానికి గురౌతాను.
అవును, నేను, బండను, పర్వతాన్ని,
ఎన్నో వృక్షాలకు, వలస పక్షులకు ఆసరాని.

అందుకే,
గాయమైనా, గేయమైనా,
వడిలినా, కాలినా, రాలినా,
నేను ఏ మాత్రం చలించను...
అవన్నీ నా స్పూర్తిని చలింపచెయ్యలేవు,
నేను భారత స్త్రీని... మొక్కవోని ధైర్యాన్ని.

|| తమసోమా జ్యోతిర్గమయ ||

|| తమసోమా జ్యోతిర్గమయ || 
------------------------------------
భావరాజు పద్మిని 

ఏమైపోయావు కన్నా ?
ఎందుకిలా చెప్పకుండా వెళ్ళిపోయావు ?

అప్పుడెప్పుడో నువ్వు నా కడుపులో 
తొలిసారి కలుక్కుమని కదలగానే,
నాలో నా ప్రాణం ఊపిరిపోసుకుంటోందని,
నన్ను "అమ్మ"ను చేస్తుందని మురిసిపోయాను.

నా కలలపంటగా నువ్వొచ్చావు,
నా ప్రేమనంతా చనుబాలుగా అందించాను,
నాకోసం నవ్వితే, నిలువెల్లా పులకించాను,
నువ్వు తొలి సారి మ్మ, మ్మ మ్మా...అంటే,
ప్రపంచాన్ని జయించినంత ఆనందించాను.
నీ ముద్దు మాటలు, బుడిబుడి అడుగులు,
నీ వడివడి పరుగులు, దాగుడుమూతలు,
కాలం ఎలా గడిచిపోయిందో తెలీదు...
నీ రాకతో నా లోకమే మారిపోయింది.

నీకు జలుబు చేసినా, జ్వరం వచ్చినా,
దెబ్బతగిలినా, బొప్పికట్టినా, నొప్పిపెట్టినా,
నీ కంటి నీరు ఉప్పెనై నన్ను ముంచేసేది.
నీ కోసం వెయ్యి దేవుళ్ళకు మ్రొక్కేదాన్ని,
ప్రతి క్షణం నీ మేలు కోసం తపించేదాన్ని.
ఒక్కగానొక్క బిడ్డ సంతోషంగా ఉండాలని,
నేనెంత బాధపడ్డా కనబడకుండా తిరిగేదాన్ని.

ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగి,
రేపోమాపో మా బిడ్డ ఇంజనీర్ అనే లోపే,
చేతికి అందివచ్చిన నిన్ను దీవించే లోపే,
నాకు చెప్పకుండా అడుగెయ్యని నువ్వు,
అందనంత దూరం వెళ్ళిపోయావట....
పదిహేనురోజులు ఆశనిరాశల ఊగిసలాట,
నువ్వు బ్రతికేఉంటావన్న వెర్రి ఆశ...
నువ్వు తిరిగి రావాలన్న తీరని కాంక్ష,
అది కూడా ఇవాళ కొట్టుకుపోయింది,
నీ శవం దొరకగానే అమ్మ చచ్చిపోయింది.

ఇక ఏం మిగిలిందని నాకు...
నా లోకమంతా శూన్యం,నా బ్రతుకంతా చీకటి.
గుండెలవిసేలా ఏడ్చినా బాధ తీరదు,
నువ్వులేవన్న నిజం నా మనసు నమ్మదు.
సుడులు తిరిగేబాధతో నా గుండె ఆగిపోదే ?
నా ఊపిరి తీగలు తెగిపోయినా ప్రాణం పోదే ?

హే భగవాన్ ! ఒక్క క్షణం...
నా బిడ్డ ప్రాణం బదులు నా ప్రాణం ఇవ్వమంటే,
ఆనందంగా ఇచ్చేసేదాన్ని...
ఎందుకు నీకు మనుషులంటే ఇంత అలుసు?
కడుపుకోత ఏమిటో కన్నపెగుకే తెలుసు.
నా ప్రాణానికి ప్రాణమైన బిడ్డే పోయాకా,
ఇక నేను మాత్రం ఎందుకు బ్రతకాలి ?
నన్ను తీసుకుపో... తీసుకుపో...

*************************************************


అమ్మా ! ఏడవకమ్మా !
నేను ఎక్కడికీ పోలేదు, ఇదిగో చూడు,
నా చేతులతో నిన్ను అల్లుకుంటున్నా,
అమ్మా, అమ్మా, అని గొంతెత్తి పిలుస్తున్నా...
అయినా...నువ్వు చూడలేవు, వినలేవు.

ఆనందంగా కేరింతలు కొడుతున్న నన్ను,
నీటి ఉప్పెన ఒక్కపట్టున ముంచేసింది,
ఆ క్షణంలో నువ్వు, నీ నవ్వు గుర్తొచ్చాయి,
ఊపిరితిత్తులలోకి నీళ్ళు నిండుతుంటే,
కొడిగట్టే దీపంలా ప్రాణం కొట్టుకుంటుంటే,
చివరి ఆశతో అమ్మా,అమ్మా అంటూ వేదన,
జాలి, దయ చూపని విధిచేతిలో అరణ్యరోదన.
మరణం చేతిలో నేను ఓడిపోయానమ్మా...

అయినా నిన్ను చూడాలని, మాట్లాడాలని,
నీ ఒళ్లో తలపెట్టుకు పడుకోవాలని,
నా ఆత్మ వడివడిగా నీ వద్దకు వచ్చింది.
నీ ప్రక్కనే ఉన్నా, నీ కన్నీళ్లు తుడవలేను,
నీ దుఃఖం చూస్తున్నా, ఓదార్చలేను.
నీకొకటి తెలుసామ్మా ?
చివరి క్షణంలో నేను పడ్డ నరకయాతన,
నిన్ను చూసి ఇప్పుడు ప్రతీ క్షణం పడుతున్నా,
పగలనకా రాత్రనకా కుమిలే నిన్నుచూసి,
నిముషానికోసారి చచ్చిపోతున్నా...
నీ వేదన చూడలేక, నా ఆత్మ క్షోభిస్తోంది.

మా అమ్మ, ఎప్పటిలా నవ్వుతూ ఉండాలి,
వికసించిన పద్మంలా, విరగాసిన వెన్నెలలా,
అల్లరి కెరటంలా ,అందరి తల్లోనాలుకలా ఉండాలి.
ఎన్ని జన్మలెత్తినా ఈ అమ్మ కడుపునే పుట్టాలి.
ఇదే నా కోరిక... 
నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తానమ్మా...
ఇదివరకు నువ్వూ, నేనూ ఇద్దరం,
ఇప్పుడు నీలోనే నేను, నువ్వు నవ్వితే నవ్వుతా,
ఏడిస్తే ఏడుస్తా, నువ్వు తింటే నేనూ తింటా.
నీకు తోడుగా, నీడగా నీవెంట నేనుంటా.

ఒక్కోసారి మనిషి హృదయ వైశాల్యం పెంచేందుకు,
దేవుడిలా పరీక్షిస్తాడేమో !
పోయిన నీ బిడ్డ దగ్గరే ఆగద్దమ్మా,
అమ్మ లేని ఎందరో బిడ్డల్ని అక్కున చేర్చుకో,
వాళ్ళ నవ్వుల్లో నన్ను చూసుకో...
సేవాభావంతో వేదన కరిగించుకో,
అందరికి తిరిగి అమ్మవైన నిన్నుచూసి, 
నాకు ఆత్మశాంతి కలుగుతుంది. 
ఏ మనిషి పయనమైనా ఇంతేనమ్మా..
“ తమసోమా జ్యోతిర్గమయ “
అశాశ్వతం నుంచి శాశ్వతం వైపుకు...

భావరాజు పద్మిని,
22/06/2014.

(మా మేనల్లుడి ప్రాణ నేస్తం జూన్ 8 న కులుమనాలి లో కొట్టుకుపోయాడు. దాదాపు 20 ఏళ్ళ స్నేహం వాళ్ళది. ఇవాళ అతని శవం దొరికింది. ఒక్కగానొక్క కొడుకు కోసం ఇన్నాళ్ళూ ఆ తల్లి పడ్డ మనోవేదన విన్నప్పుడు, ఊహించినప్పుడు కలిగిన భావాలకు అక్షర రూపం ఈ కవిత. కులు మనాలి ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు అంకితం... ఇది చదివి,వారిలో ఏ ఒక్కరైనా కోలుకుంటే, నా అక్షరాలు ధన్యమైనట్లే ! ) 

ఎందుకో మరి...

 ఎందుకో మరి...
------------------
భావరాజు పద్మిని 

ఎందుకో మరి...
ఒక్కసారి చూస్తే... అంతా మురిసిపోయేవారు 
అందమైన వైజాగ్ అంటూ మెచ్చుకునేవారు 

నగరానికి అసలు అందం దేనిదో ?
గంభీరమైన సంద్రానిదో...
ఇసుక తిన్నెల వన్నెలదో ...
రాళ్ళతో అలలు చెప్పే ఊసులదో...
ఉదయాస్తమ వేళ నీటిలో  
ప్రతిబింబించే వర్ణాల శోభదో...
కొండలపైనుంచి కనిపించే...
తెల్లంచు అలల నీలిసంద్రానిదో ...
తీరాన నల్లజడలాంటి తారు రోడ్డుదో...




దుఃఖమైనా ఆనందమైనా 
మాకున్నది ఈ సంద్రమేగా...
మౌనంగా ఓదారుస్తుంది...
మౌనంగా మాతో నవ్వుతుంది...
అలల ఆటతో కేరింతలు కొడుతుంది...
పిల్లగాలులతో స్వాంతన కూరుస్తుంది,
ఎన్ని సార్లు చూసినా విసుగు పుట్టదే !
పిన్నాపెద్దా తారతమ్యాలు ఎంచకుండా 
గంభీరంగా, ముగ్ధంగా అమ్మలా చలువగా...
అందరినీ అక్కున చేర్చుకుంటుంది...

ఉన్నట్టుండి ఎందుకో మరి...
కారు మబ్బులు కమ్మేశాయి...
ఈదురుగాలులు చాచి కొట్టాయి...
చెవులు చిల్లులు పడేలా 
కుండపోతగా వాన కురిసింది...
సుడిగుండం కడుపున పడగా,
అమ్మ సంద్రం అల్లకల్లోలం అయింది...
పోర్ట్ సిటీ ఛిన్నాభిన్నమయ్యింది..
హుదూద్ విలయం ప్రాణాలు మింగింది 
ఇళ్ళు కూలి మన్ను మిగిలింది 
వాలిన చెట్లు రోడ్లకు అడ్డుపడ్డాయి 
ప్రపంచంతో సంబంధాలు తెగి,
నిరాశ్రయులమై ఎక్కడో శిబిరాల్లో 
ఉక్కు నగరంలో గుక్కెడు నీళ్ళకోసం 
పట్టెడంతా అన్నం కోసం అల్లాడుతున్నాం...

సింహాద్రి అప్పన్నా !
మా నగరానికి దిష్టి తగిలింది 
అమ్మ కనక మాలక్ష్మి ...
ఈ ఊరికి గ్రహణం పట్టింది...
కొండంత దేవుళ్ళు మీరే కాచి,
మీ బిడ్డల్ని అక్కున చేర్చుకోండి.
చావుదెబ్బ నుంచి కోలుకునే 
ధైర్యాన్ని ఇచ్చి కాపాడండి ! 

(వైజాగ్ చాలా సుందర నగరం... హుదూద్ తాకిడికి అల్లాడుతున్న వారిని చూసి, స్పందించి రాసిన కవిత... 14 /10/14 )
 

లంచ్ బాక్స్ (కవిత )

లంచ్ బాక్స్ (కవిత )
------------------------
భావరాజు పద్మిని - 3/11/2014

నిజమే, వస్తువులు మాట్లాడలేవు.
కాని, 'లంచ్ బాక్స్' అనే నాకు మాటలొస్తే...

ఉదయాన్నే నిద్ర లేచిన ఓ అమ్మ,
తాను ఏమీ త్రాగకుండా పరుగులెత్తి,
బిడ్డ కడుపు నింపాలనే తొందరతో ,
చెయ్యి కాలి నొప్పెట్టినా లెక్కచెయ్యక, 
వేడన్నం కలిపి పెట్టే తీరు చెబుతాను.

స్కూల్ బస్సు కోసం పరుగెత్తేటప్పుడు,
పొరపాట్న నేను జారి క్రింద పడిపోతే,
నేలపాలైన అన్నాన్ని చూసి ఏడుస్తున్న,
పసివాడిని, 'ఏం పర్లేదు, ఏడవకు,
మళ్ళీ నేను వండి తెచ్చిస్తాలే..."
అని ఓదార్చే అమ్మ గాధ చెబుతాను.

సాయంత్రం ఖాళీ బాక్స్ ను చూసి,
హమ్మయ్య అంటూ తృప్తిగా నిట్టూర్చి,  
కాలంతో పరుగులు తీస్తూ అలసినా,
తాను ఉదయం పడ్డ కష్టాన్ని మరచి,
హాయిగా నవ్వే తల్లి కధ చెబుతాను.

అన్నీ సర్ది బిడ్డకు బాక్స్ ఇవ్వడం 
కంగారులో మరచిన ఓ తల్లి...
నోట్లో ముద్ద పెట్టుకోబోతూ...
నా వంక బాధగా చూసి అయ్యోఅని,
కన్నీరు కార్చిన వ్యధ చెబుతాను.



అమ్మ లేని ఇంట నాన్నే అమ్మై,
వచ్చిన వంటనే పదే పదే ఇచ్చినా,
చివరికి మాగీ అయినా సర్దుకుని,
నాన్న పడ్డ తపనను గుర్తుతెచ్చుకుని,
ఇష్టం లేకున్నా తినేసే బిడ్డ మనసు చెప్తాను. 

స్కూల్ కు వెళ్ళే త్రోవలో రోడ్డుపక్క,
కడుపు మాడిన బిచ్చగాడిని చూసి,
గుండె ద్రవించి, తన అన్నం అంతా పెట్టి,
ఇంటికొచ్చి ఆత్రంగా తింటున్న బిడ్డను,
"ఏం, బాక్స్ తినలేదా?" అని నిలదీసి,
వివరం తెలుసుకుని, అక్కున జేర్చుకుని,
గర్వంతో, ఆత్మీయతతో నుదుట ముద్దాడిన 
మాతృమూర్తి ప్రేమ గురించి చెబుతాను.

బిడ్డ తినే రకాలే ఇవ్వాలని ఆత్రపడేది ఒకరు...
ఇచ్చినా తినలేదని షికాయితులు చేసేదొకరు...
పంచుకుకు తింటూంటే ఎలాగంటూ అడిగేదొకరు...
తమకు నచ్చింది తెస్తే లాక్కు తినేది ఒకరు...
ఏది ఏమైనా, యెంత వస్తువునైనా...  
నాకు నేనే ఎంతో గొప్ప... ఎందుకంటే...
నేను నింపుకు వెళ్ళేది కొండంత ప్రేమని.
వెలకట్టలేని, ఎందరో తల్లుల మమతని.